Sunday, 17 July 2011

లక్షన్నర చేప..


లక్షన్నర చేప..
లక్షలు కురిపిస్తుందట..
చైనా టు వైజాగ్ వయా సింగపూర్
లక్కీఫిష్‌గా భావించే చైనీయులు..
మన దేశానికీ పాకిన నమ్మకం
విశాఖపట్నం,ఆ చేప ఖరీదు అక్షరాలా లక్షా యాభై వేల రూపాయలు. చైనీయులు డ్రాగన్ ఫిష్/లక్కీ ఫిష్‌గా, మనవాళ్లు 'చిల్లీరెడ్ అరోనావా'గా పిలుస్తుంటారు. ఎనిమిదిన్నర అంగుళాల పొడవు కలిగిన ఈ చేప ఇంకా కొంచెం పెరిగితే రెండు లక్షల నుంచి నాలుగున్నర లక్షలు పలుకుతుందట. దీని జీవితకాలం పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు. ఇది అదృష్టాన్ని ఇస్తుందని చైనీయులు భావిస్తుంటారు. రీడింగ్, ఆఫీస్ గదుల్లో ఉత్తరం వైపు దీనిని ఉంచితే లక్షలు కురుస్తాయని నమ్ముతుంటారు. 
ఆ ప్రచారం ఇప్పుడు ఇప్పుడు మనదేశంలోనూ జోరుగా జరుగుతోంది. ఫలితంగా వందలాది చేపలు చైనా నుంచి సింగపూర్ మీదుగా భారత్‌కు తరలివస్తున్నాయి. విశాఖ వీఐపీ రోడ్డులోని ప్రిన్స్ అక్వేరియం నిర్వాహకులు ఈ చేపను విశాఖ తీసుకువచ్చారు. ఈ మగ చేప పుట్టిన తేదీని కూడా ధ్రువీకరిస్తూ చైనా నుంచి అధికారికంగానే విశాఖ దిగుమతి అయినట్లు సర్టిఫికేట్‌ను కూడా పొందారు. ఈ చేపను అసలైన అరోనాగా «ద్రువీకరించేందుకు దాని పొట్టలో ఓ మైక్రోచిప్‌ను కూడా ఏర్పాటుచేశారు. 
2009 జనవరి 30వ తేదీన ఇది పుట్టిందని, రోజుకు జీవం ఉన్న చిన్న చేపలను ఆరింటిని ఆహారంగా తీసుకుంటుందని ప్రిన్స్ అక్వేరియం అధినేత వర్మ పేర్కొన్నారు. అయితే.. బ్యాంకాక్ నుంచి వస్తున్న ఫ్లవర్‌హార్న్ అనే లక్కీఫిష్ కొంతకాలంగా విశాఖలో లభ్యమవుతున్నది. దీని ధర సైజును బట్టి నాలుగు వేల నుంచి 60 వేల రూపాయల వరకు పలుకుతుంది. అయితే దాని కంటే ఎక్కువగా అదృష్టం తెచ్చిపెట్టే మత్స్యరాజంగా ఈ అరోవానా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని వర్మ తెలిపారు.

1 comment: